Homeజాతీయంమోహన్‌లాల్ అభిమానులకు నిరాశ.. ఆస్ట్రేలియా వీసా జాప్యంతో లైవ్ షో వాయిదా

మోహన్‌లాల్ అభిమానులకు నిరాశ.. ఆస్ట్రేలియా వీసా జాప్యంతో లైవ్ షో వాయిదా

క్రైమ్ మిర్రర్ : మలయాళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన మోహన్‌లాల్ అభిమానులకు ఊహించని నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం జరగాల్సిన ఆయన లైవ్ ఈవెంట్ వాయిదా పడింది. మోహన్‌లాల్‌కు ఆస్ట్రేలియా వీసా సకాలంలో అందకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సిడ్నీలోని నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వైకిట్టు ఎంధా పరిపాడి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మోహన్‌లాల్‌తో పాటు పలువురు కళాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. కార్యక్రమం కోసం మోహన్‌లాల్ బృందంలోని కొంతమంది సభ్యులు ఇప్పటికే సిడ్నీకి చేరుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మోహన్‌లాల్ ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా ప్రక్రియ పూర్తవుతుందని ఎదురుచూశారు. అయితే నిర్ణీత సమయానికి వీసా అనుమతి రాకపోవడంతో షోను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంపై మోహన్‌లాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కార్యక్రమం వాయిదా పడటం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. వీసా ప్రక్రియలో సాంకేతిక సమస్య లేదా పరిపాలనా పరమైన పొరపాటు జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై మరింత వ్యాఖ్యానించకుండా, పరిస్థితికి తానే బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. తనను నమ్మి ఈవెంట్‌కు టికెట్లు తీసుకున్న వారికి కలిగిన అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. మోహన్‌లాల్ వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

అదే సమయంలో మోహన్‌లాల్ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైందనే వార్తల్లో వాస్తవం లేదని నిర్వాహకులు వెల్లడించినట్లు సమాచారం. వీసా నిరాకరణ జరగలేదని, అనుమతి ప్రక్రియలో జాప్యం మాత్రమే చోటుచేసుకుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మోహన్‌లాల్ అభిమానులు నిరాశకు గురైనప్పటికీ.. కార్యక్రమం మరో తేదీన జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కొత్త తేదీపై నిర్వాహకుల అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
also read : పాక్ మహిళ హనీట్రాప్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్.. రహస్య సమాచారం లీక్ చేశాడా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు