–తెలంగాణలో పొత్తులపై తేల్చేసిన హై కమాండ్
-జనసేనకు ఛాన్స్ ఇవ్వని కమలదళం
-ఇతర పార్టీలకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో బిజెపి ఒంటరి పోరాటానికి మొగ్గు చూపిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని బిజెపి రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ తర్వాత.. పొత్తుల ప్రచారానికి తెరదించుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో పార్టీ సొంత బలం మీద ఆధారపడి.. ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా హై కమాండ్ వ్యూహరచన చేసినట్లు స్పష్టమవుతోంది. జనసేన తో పాటు భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీతో సైతం పొత్తు ఉండదు అని తేల్చి చెప్పడం విశేషం.
ఏపీలో ఎన్డీఏ హిట్..
ఏపీలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనతో పొత్తు పెట్టుకుంది. అక్కడ ఎన్డీఏ కూటమి నడుస్తోంది. తెలంగాణలో సైతం అదే ఆలోచనతో బిజెపి ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీతో బిజెపి మైత్రి కొనసాగుతుందని అంచనాలు ఉండేవి. అయితే రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, సమీకరణలు వేరువేరుగా ఉంటాయని తెలంగాణ బిజెపి హై కమాన్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఏపీలోని రాజకీయ వాతావరణాన్ని.. తెలంగాణకు ముడి పెట్టడం సాధ్యం కాదని బిజెపి నాయకత్వం స్పష్టమైన అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
సొంతంగా బలోపేతం కావాలని..
పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత.. తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించింది బిజెపి.. అందుకే రాష్ట్రంలో తన సొంత క్యాడర్ను, ఓటు బ్యాంకు ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తు పెట్టుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతిని అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్.. ఇలా రెండింటిని సమంగా ఎదుర్కొంటూ.. ఏకైక ప్రత్యామ్నాయంగా నిలబడాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది భారతీయ జనతా పార్టీ.
2028 లో క్లారిటీ..
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగిలిన కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తు లేదని చెప్పడం ద్వారా అక్కడ బిజెపి మరింత అప్రమత్తమవుతోంది. బలమైన నాయకులను అభ్యర్థులుగా రంగంలోకి దించాలని చూస్తోంది. అయితే ప్రస్తుతానికైతే పొత్తులు ఉండవు కానీ.. తెలంగాణ అసెంబ్లీ తో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి గ్రామీణ స్థాయిలో బలం అంతంత మాత్రమే. అది కావాలంటే భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమం. అయితే 2028 నాటికి దీని పై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
