హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: బేబీ సినిమాతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 2019లో దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ, తొలి సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాడు.
Also Read:త్రిష చుట్టూ తమిళ రాజకీయం!
ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి గుర్తింపు తీసుకురాగా, పుష్పక విమానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బేబీ సినిమా మాత్రం ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.బేబీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అదే జోడీ ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కారణంగా సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read:తెలంగాణలో జెన్ జీ తుస్!
ఈ చిత్రానికి ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ ప్రకటించడంతో సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ మొదలైంది. బేబీ తర్వాత మరోసారి ఈ జోడీ మ్యాజిక్ చేస్తుందా? ఎపిక్ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందా? అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
