హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమల పని తీరును పోల్చుతూ బడ్జెట్ నియంత్రణ, కార్పొరేట్ కల్చర్, నిర్మాతల వ్యవస్థపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా “సినీ పరిశ్రమ హిట్ సినిమాల వల్ల కాదు.. ఫ్లాప్ సినిమాల వల్లే నడుస్తుంది” అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్మ మాట్లాడుతూ బాలీవుడ్‌లో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో అక్కడ అకౌంటబిలిటీ, బడ్జెట్ డిసిప్లిన్ కచ్చితంగా అమలవుతాయని అన్నారు. అయితే దక్షిణాదిలో ఎక్కువగా ఇండిపెండెంట్ నిర్మాతలు ఉండటంతో బడ్జెట్‌పై అంతగా నియంత్రణ ఉండదని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రారంభంలో నిర్ణయించిన వ్యయాన్ని దాటితే బాలీవుడ్‌లో దర్శకులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు.
Also Read:జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విలయం.. క్లౌడ్ బరస్ట్‌లతో భారీ నష్టం, 31 మంది మృతి..
తన ఉదాహరణగా జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ధురంధర్ సినిమాను ప్రస్తావించిన వర్మ, అక్కడ ముందుగా అంగీకరించిన బడ్జెట్‌ను మించకుండా సంస్థలు వ్యవహరిస్తాయని చెప్పారు. ఒకవేళ ఖర్చు పెరిగితే దర్శకులు లేదా ఇతర విభాగాలే దానిని భరించే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. అక్కడ కంపెనీ విధానాల ప్రకారం ప్రతి ఖర్చుకు లెక్క ఉంటుందని వివరించారు. దక్షిణాది పరిశ్రమలో మాత్రం పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా బడ్జెట్‌పై ఇలాంటి కఠిన నియంత్రణ కనిపించదని ఆర్జీవీ అన్నారు. హాలీవుడ్‌లో కూడా బడ్జెట్ క్రమశిక్షణ చాలా పక్కాగా ఉంటుందని, ఆ కారణంగా అక్కడ నిర్మాణ వ్యవస్థ మరింత ప్రొఫెషనల్‌గా సాగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read:ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..
అయితే ఆయన చేసిన అత్యంత ఆసక్తికర వ్యాఖ్య ఫ్లాప్ సినిమాల గురించే. హిట్ సినిమా ద్వారా వచ్చిన లాభాలు ప్రధానంగా నిర్మాతకే దక్కుతాయని, కానీ ఫ్లాప్ సినిమాల కోసం ఖర్చు చేసిన డబ్బు మాత్రం టెక్నీషియన్లు, కార్మికులు, ఇతర విభాగాల వారికి చేరుతుందని వివరించారు. అందుకే పరిశ్రమ అసలు నడిచేది ఫ్లాప్ సినిమాల ద్వారానే అని ఆయన విశ్లేషించారు. సినిమా ఫ్లాప్ అయితే డబ్బు పూర్తిగా పోతుందని అనుకోవడం సరైంది కాదని, ఆ మొత్తం పరిశ్రమలో పనిచేసే వేలాది మంది చేతుల్లోకి వెళ్తుందని వర్మ అన్నారు. అలాగే భారీ బడ్జెట్‌తో, సంవత్సరాల పాటు సినిమా తీసినంత మాత్రాన అది మంచి సినిమాగా మారదని, విజయాన్ని నిర్ణయించేది కథ, కథనం, ప్రేక్షకుల ఆదరణేనని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి
