-
ఐపీఎస్ కావడం కష్టమే
-
రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు
-
కేంద్ర ప్రభుత్వ అనుమతితో అనర్హత వేటు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనపై ఓ మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కేసులో తీవ్రమైన నేరారోపణలు ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను వెల్లడించారు. ఆయన దారుణానికి పాల్పడ్డారని తేల్చారు.
-
సస్పెండ్ చేసిన పోలీస్ అకాడమీ..
ఇప్పటికే అంతర్గత విచారణ చేసిన పోలీస్ అకాడమీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయనకు ఐపీఎస్ హోదా వస్తుందా? రాదా? అనేది అనుమానమే. దీనిపై లోతైన చర్చ జరుగుతోంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తికాక ముందే.. ఆయనపై లైంగిక వేధింపులు, తీవ్రమైన శారీరక దాడి, బ్లాక్ మెయిలింగ్ వంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదు కావడం.. చట్టబద్ధమైన అరెస్టు జరగడం వల్ల ఆయన సేవలను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది.
-
నిబంధనల ప్రకారం..
ప్రస్తుతం శిక్షణలోనే ఉన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం.. ఒక అధికారి ఇంకా ప్రొబేషనరీ హోదాలోనే ఉన్నప్పుడు సాధారణ అధికారులకు వర్తించే.. సుదీర్ఘమైన డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీల అవసరం ఉండదు. ఐపీఎస్ ప్రొబేషన్ రూల్స్, 1954 లోని రూల్ 12 ప్రకారం.. ప్రో బేషన్ లో ఉన్న ఈ అధికారైన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే.. ఆల్ ఇండియా సర్వీస్‌కు ఉండాల్సిన మానసిక, నైతిక ప్రవర్తన లోపించిన, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న.. కేంద్ర హోంశాఖ వారిని డిస్చార్జ్ చేసే పూర్తి అధికారాన్ని కలిగి ఉంది. అయితే హోం శాఖతోపాటు కార్మిక, శిక్షణ శాఖ కూడా పర్యవేక్షిస్తాయి.
-
రిమాండ్ నివేదిక సిద్ధం..
ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిజిటల్ ఆధారాలతో పాటు రిమాండ్ నివేదికను సిద్ధం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఈ సమగ్ర నివేదికను హోం శాఖకు పంపుతారు. హోం శాఖ దీనిపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభిప్రాయాన్ని కోరుతుంది. వారి ఆమోదాన్ని పొందుతుంది. యుపీఎస్సీ నిబంధనల ప్రకారం నైతిక దిగజారుడుతనం కింద నమోదైన తీవ్ర నేరారోపణల్లో నిజం ఉందని తేలితే మాత్రం ప్రొఫెషనర్ తొలగింపునకు కమిషన్ వెంటనే ఆమోదం తెలుపుతుంది. కచ్చితంగా చర్యలకు సిఫార్సు చేస్తుంది.
