క్రైం మిర్రర్ : పెంపుడు గేదె దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రతిరోజూ మాదిరిగానే గేదెలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ప్రాంతానికి చెందిన మల్లేపల్లి వెంకటేశ్‌కు సొంతంగా కొన్ని గేదెలు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన శనివారం ఉదయం గేదెలను మేపేందుకు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో మందలోని ఓ గేదె అకస్మాత్తుగా వెంకటేశ్‌పై దాడి చేసినట్లు సమాచారం. వెనుక నుంచి దాడి చేయడంతో ఆయన అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. గేదె కొమ్ములతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించి వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే చికిత్స అందకముందే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వెంకటేశ్ ఆకస్మిక మృతితో బుద్వేల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆయన మృతిని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
also read : ఒకే బ్యారెక్‌లో ఇద్దరు కిరాతక హంతక లేడీలు.. వణికిపోతున్న మహిళా ఖైదీలు
