క్రైం మిర్రర్ : కలిసి పనిచేస్తున్న ఓ మహిళను రహస్య ఫొటోలతో బెదిరిస్తూ వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 34 ఏళ్ల మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. అదే సంస్థలో హెడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బి. రమేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కొంతకాలం తర్వాత రమేష్ ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళకు తెలియకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలను రహస్యంగా తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ ఫొటోలను చూపిస్తూ ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన కుటుంబ జీవితం దెబ్బతింటుందనే భయంతో బాధితురాలు కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే నిందితుడి వేధింపులు కొనసాగడంతో పాటు, తన మాట వినకపోతే ఆ ఫొటోలను భర్తకు పంపిస్తానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ధైర్యం చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడు రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : దుగ్గొండి మండలంలో దారుణం.. కర్రతో కొట్టి వృద్ధుడి హత్య
