క్రైం మిర్రర్ : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటనతో గ్రామంలో శోకఛాయలు అలుముకోగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం.. చింతకాని గ్రామానికి చెందిన తొర్లికొండ కోటేశ్వరావు చిన్న కుమారుడు ఉపేందర్ (22) కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైన అతడు గ్రామ శివారులోని నల్లచెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకినట్లు తెలిసింది. కొంతసేపటి తర్వాత స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్థానికుల సహకారంతో బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉపేందర్ అకాల మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
also read : సౌదీ యువరాజు మరణం వెనుక అసలు కారణం ఇదే.. బ్రిటన్ దర్యాప్తు నివేదిక వెల్లడి
