క్రైం మిర్రర్ : కేరళలోని ఇడుక్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్‌లో రెవెన్యూ అధికారులు అక్రమ ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. వరట్టుమేడు ప్రాంతంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో ఉన్న సుమారు 10 ఎకరాల రెవెన్యూ భూమిని జూలై 22న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. వరట్టుమేడు ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ఈ భూమిని ఆక్రమించినట్లు గుర్తించారు. అనంతరం ఈ భూమి సెబిన్ ఆంటోనీ అనే వ్యక్తి ఆధీనంలోకి వెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ బృందం చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో అక్రమంగా నిర్మించిన హోమ్‌స్టే భవనం, కెఫెటేరియా, ఇనుప కంచెలు, రాతి గోడలను జేసీబీల సాయంతో తొలగించారు. అలాగే టార్పాలిన్‌తో ఏర్పాటు చేసిన ‘పడుతక్కుళం’ చెరువును కూడా తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా పట్టా భూమి ఉన్నట్లు సమాచారం. ఆయనకు వాగమన్ ప్రాంతంలో సుమారు 1.5 ఎకరాల పట్టా భూమి ఉందని పీరుమేడు తహసీల్దార్ తెలిపారు. అయితే ఆయన భూమికి ఆనుకుని ఉన్న కొంత ప్రాంతానికి పట్టా లేదని అధికారులు పేర్కొన్నారు. పట్టా లేని భూమి వివరాలను నిర్ధారించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ సమక్షంలో భూమి కొలతలు నిర్వహించేందుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సర్వే అనంతరం భూమికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : పదవిలో హోదా.. పనిలో సాదాసీదా.. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ హరిత