హైదరాబాద్‌లో బాలికల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి బైక్‌పై వెంబడించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తున్న సమయంలో షాబాజ్ అనే వ్యక్తి ఆమెను అనుసరించాడు. అనంతరం బాలికను నమ్మించి తన వెంట తీసుకెళ్లి జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
also read: ధార్వాడ్‌లో సంచలనం: భర్త హత్య, కుమారుడిపై దాడి – మహిళా డాక్టర్ అరెస్ట్
ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
మైనర్ బాలికపై జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల రక్షణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
also read: USAలో ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం…