అమెరికాలో రెండు విషాద ఘటనలు తెలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ఉన్నత చదువులు, మంచి భవిష్యత్ కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు, యువతి అనూహ్య ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఉద్యోగంలో చేరే ముందు రోజు మృత్యువాత పడగా.. మరొకరు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
ఉద్యోగంలో చేరే ముందే విషాదం.. విజయవాడ యువకుడు మృతి
విజయవాడ రామవరప్పాడుకు చెందిన మణిచంద్ర తేజ అమెరికాలో జరిగిన స్కైడైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లిన తేజ.. బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించిన తేజ.. కొత్త ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యారు. జూలై 13న విధుల్లో చేరాల్సి ఉండగా.. అంతకుముందు రోజు జరిగిన ప్రమాదం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరంజ్ ప్రాంతంలో స్కైడైవింగ్ చేస్తుండగా బలమైన గాలుల కారణంగా అదుపుతప్పిన తేజ సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు భారీగా అప్పు చేసి చదివించారు. ఉద్యోగం రావడంతో కుటుంబం సంతోషంలో ఉండగా.. ఇంతలోనే కుమారుడి మరణవార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తేజ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అమెరికాలోని స్నేహితులు, బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి
మరోవైపు అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న ప్రాణాలు కోల్పోయారు.
వినుకొండ ప్రాంతానికి చెందిన ప్రసన్న.. ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల స్నేహితులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న మృతి చెందగా.. ఆమెతో ఉన్న స్నేహితులు గాయపడ్డారు. కూతురు మృతితో ప్రసన్న కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో భవిష్యత్ కోసం వెళ్లిన ఇద్దరు యువతీయువకులు ఇలా ప్రమాదాల్లో కన్నుమూయడం తెలుగు సమాజాన్ని కలచివేస్తోంది.
also read: ధార్వాడ్‌లో సంచలనం: భర్త హత్య, కుమారుడిపై దాడి – మహిళా డాక్టర్ అరెస్ట్