బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఒక ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. భద్రతా కారణాలతో మూసివేసిన రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై జన్మదిన వేడుకలు నిర్వహించడం సంచలనంగా మారింది. వందలాది మంది యువకులు అక్కడికి చేరుకుని భారీ డీజేలు ఏర్పాటు చేసి నృత్యాలతో హంగామా చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. అనుమతి లేకుండా ప్రమాదకర ప్రదేశంలో గుమిగూడటం, ప్రజా భద్రతను పట్టించుకోకపోవడం వంటి అంశాలపై నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
బక్సర్–ఇటార్హి రైల్వే ఓవర్‌బ్రిడ్జిని సుమారు 12 సంవత్సరాల పాటు నిర్మాణం చేసి, రూ.26.4 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. మే చివర్లో ప్రారంభించిన ఈ వంతెనపై కేవలం కొన్ని రోజులకే నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఒక పిలర్‌పై ఉన్న స్లాబ్ కుంగిపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మొదట భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసి, తర్వాత పూర్తిగా వంతెనను మూసివేశారు. ప్రజలు అక్కడికి వెళ్లకుండా కఠిన ఆంక్షలు విధించారు.
అయితే ఈ ఆంక్షలను పట్టించుకోకుండా ఈ మధ్య ఒక కుటుంబం పుట్టినరోజు వేడుకను అదే వంతెనపై ఘనంగా నిర్వహించింది. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వందల మంది అక్కడ చేరి డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అధికారులపై ప్రశ్నలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య దృష్టికి వెళ్లడంతో, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుడు రాకేశ్ కుమార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టినందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ వేడుక నిర్వహించిన కుటుంబంపైనా చర్యలు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
also read: 35 ఏళ్ల భూమి పోరాటం… 103 ఏళ్ల వృద్ధురాలికి న్యాయం! బిహార్‌లో అరుదైన తీర్పు