భారతదేశంలో కోర్టు కేసులు సంవత్సరాల తరబడి కొనసాగడం సాధారణంగా కనిపించే విషయం. ఒక కేసు తీర్పు కోసం పిటిషన్ వేసిన వారు కూడా జీవితాంతం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే, దీర్ఘకాలంగా సాగిన ఒక భూ వివాదంలో 103 ఏళ్ల వృద్ధురాలు విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లాకు చెందిన హబీబన్ ఖాతూన్ అనే వృద్ధురాలు దాదాపు 35 సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాటం చేశారు. ఆమెకు సుమారు 1,600 చదరపు అడుగుల భూమి ఉంది. అయితే 1994లో ఆ స్థలంపై వివాదం తలెత్తడంతో, ప్రత్యర్థులు ఆ భూమి తమదేనని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సుదీర్ఘంగా కొనసాగింది.
దశాబ్దాల పాటు ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం చివరకు హబీబన్ ఖాతూన్‌కే భూమి చెందుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకుని, ఆ భూమిని వృద్ధురాలికి అప్పగించింది.
ఈ ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు గ్రామంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీసు, పరిపాలనా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకున్నారు. గ్రామంలో కోర్టు తీర్పును ప్రజలకు బహిరంగంగా ప్రకటించారు.
భూమి స్వాధీనం చేసుకున్న అనంతరం హబీబన్ ఖాతూన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నేళ్లుగా సాగిన పోరాటానికి న్యాయం లభించిందని, న్యాయవ్యవస్థపై విశ్వాసం తమను గెలిపించిందని తెలిపారు.
also read: 8 ఏళ్ల ప్రేమకథ విషాదం.. ఉరేసుకున్న యువతి… తన మృతదేహానికి ప్రియుడు తాళి కట్టాలని చివరి కోరిక