ఆంధ్రప్రదేశ్‌లో ఒక విషాదకర ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన ప్రేమకథ చివరికి దురంతంగా ముగియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి ముంబైలో ఆత్మహత్య చేసుకోవడం ఈ ఘటనకు కారణమైంది. మరణానికి ముందు ఆమె రాసిన లేఖలో తన ప్రియుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ, చనిపోయిన తర్వాత అయినా తనతో వివాహం జరగాలని, తన మృతదేహానికి అతడే తాళి కట్టాలని కోరినట్లు తెలిసింది. ఈ లేఖ ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సుమారు ఎనిమిదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతి, ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడితో ప్రేమలో పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాలక్రమేణా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, దీర్ఘకాలంగా సంబంధం కొనసాగింది. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలు యువతిని తీవ్ర మనోవేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు యువతి రాసిన లేఖలో, తన జీవితంలో నెరవేరని కోరికను మరణానంతరం అయినా నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ భావోద్వేగపూరిత లేఖ కుటుంబ సభ్యులను కదిలించడంతో పాటు ఘటనకు కొత్త మలుపు తీసుకొచ్చింది.
యువతి మృతదేహాన్ని ముంబై నుంచి ప్రియుడి స్వగ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు, అతడు కనీసం చివరి కోరికను గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే యువకుడు కుటుంబంతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బంధువులు ఇంటి ముందు నిరసనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేయడానికి చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, యువతి ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
also read: ‘రాగిణి MMS 3’లో మిల్కీ బ్యూటీ తమన్నా!