క్రైం మిర్రర్ : రాష్ట్రంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై వరుసగా దాడులు నిర్వహిస్తూ అవినీతికి చెక్ పెడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోసం నీటిపారుదల శాఖను ఆశ్రయించాడు. సంబంధిత ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఎన్వోసీ జారీ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్ బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. మొదట రూ.1 లక్ష డిమాండ్ చేసిన అధికారులు, అంత మొత్తాన్ని ఇవ్వడం తన వల్ల కాదని బాధితుడు పలుమార్లు వేడుకోవడంతో చివరకు రూ.60 వేలకే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రభుత్వ సేవ కోసం లంచం ఇవ్వడం ఇష్టం లేకపోయిన బాధితుడు ఈ వ్యవహారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో ఉచ్చుపన్ని ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. బాధితుడికి అవసరమైన సూచనలు ఇచ్చిన అనంతరం, నిర్ణయించిన ప్రకారం ఆదిలాబాద్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి పంపించారు.
బాధితుడి నుంచి రూ.60 వేల నగదును ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్ స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి నిర్వహించారు. లంచం మొత్తంతో పాటు ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనకు సంబంధించిన రికార్డులు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులకు మరోసారి గట్టి హెచ్చరిక వెళ్లినట్టయింది. ప్రజలు ఎవరైనా ప్రభుత్వ సేవల కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు.
also read : విశాఖ సముద్రంలో బోటు ప్రమాదం.. ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు