క్రైం మిర్రర్ : నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గోవిందు హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట సహజ మరణంగా అనుమానించిన ఈ ఘటనలో, దర్యాప్తు కొనసాగుతుండగా అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య, ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి కలిసి పథకం ప్రకారం గోవిందును హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవిందు ఈ నెల 11న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై వాడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా తదితర అంశాలను విశ్లేషిస్తూ విచారణ కొనసాగించారు.
విచారణలో గోవిందు భార్య ఇస్లావత్ సరోజకు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో గత ఆరు సంవత్సరాలుగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం గోవిందుకు తెలిసిన తర్వాత భార్యను పలుమార్లు నిలదీశాడని, వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. ఇటీవల సరోజ ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ను గోవిందు ధ్వంసం చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయని పోలీసులు తెలిపారు.
ఈ పరిస్థితుల్లో గోవిందు తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సరోజ, శ్రీను అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అందుకు అనుగుణంగా ముందుగానే పథకం రచించి ఈ నెల 10, 11 తేదీల అర్ధరాత్రి సమయంలో శ్రీను రహస్యంగా గోవిందు ఇంట్లోకి ప్రవేశించాడు. గాఢనిద్రలో ఉన్న గోవిందు ముఖంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా బలంగా అదిమిపట్టగా, సరోజ అతని కాళ్లను పట్టుకుని ప్రతిఘటించకుండా అడ్డుకుంది.
అయినా గోవిందు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో శ్రీను పిడిగుద్దులతో దాడి చేశాడు. అనంతరం సరోజ ఇంట్లో ఉన్న చెక్క రోకలి బండతో అతనిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గోవిందు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం నిందితులు నేరానికి సంబంధించిన ఆనవాళ్లు చెరిపివేసేందుకు ప్రయత్నించారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను దాచిపెట్టడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను కూడా అక్కడి నుంచి తొలగించి పరారయ్యారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ వివరాలు, అనుమానితుల కదలికల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.
దర్యాప్తులో లభించిన కీలక ఆధారాలతో ఈ నెల 14న దామరచర్ల శివారులోని రైల్వే గేట్ సమీపంలో సరోజ, శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన చెక్క రోకలి బండ, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ఒక నోకియా కీప్యాడ్ ఫోన్, రెడ్మీ–12 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
ఈ కేసును మిర్యాలగూడ డీఎస్పీ పర్యవేక్షణలో వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది జోజి, జహీరుద్దీన్, హరినాథ్, మధు, ఉదయ్, పూర్ణిమ, చౌడమ్మలు సమన్వయంతో ఛేదించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.
also read : ఫ్యూచర్ సిటీలో అమెజాన్ మెగా ప్రాజెక్ట్.. రూ.60 వేల కోట్ల డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన