సుప్రీంకోర్టులో తాజాగా జరిగిన ఓ విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక కేసు విచారణకు స్వయంగా హాజరైన పిటిషనర్, న్యాయమూర్తులతో వాగ్వాదానికి దిగడంతో కోర్టు హాలులో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అతడు చేతిలో ఉన్న కేసు పత్రాలను న్యాయమూర్తుల డయాస్ వైపు విసరడంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఈ ఘటన జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా స్వయంగా తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చాడు. వాదనలు ప్రారంభించిన వెంటనే, లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తాను ఆదేశిస్తున్నానంటూ పిటిషనర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆశ్చర్యపోయిన జస్టిస్ కేవీ విశ్వనాథన్, “మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా?” అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పిటిషనర్, తన తరఫున చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే రికార్డులో ఉన్నాయని చెప్పాడు.
అయితే కొద్దిసేపటికే అతడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. చేతిలో ఉన్న కేసు పత్రాలను గాల్లోకి విసిరేయడంతో పాటు, న్యాయమూర్తులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోర్టు హాలులో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు కోర్టు హాలులో కలకలం నెలకొన్నప్పటికీ, ధర్మాసనం ప్రశాంతంగా వ్యవహరించింది. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా విచారణను కొనసాగించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.