తెలంగాణలోని నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ ఆస్తి విషయంలో నెలకొన్న వివాదం చివరకు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
గ్రామానికి చెందిన వృద్ధ దంపతుల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలపై విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భార్య సంపాదించిన డబ్బును ఎక్కువగా కుమార్తెకు ఇస్తోందన్న అనుమానంతో భర్త కోపోద్రిక్తుడయ్యాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది.
ఆవేశానికి లోనైన భర్త, ఇనుప రాడ్డుతో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం తన ఆస్తుల వివరాలు పేర్కొంటూ ఒక నోట్ రాసి గోడకు అంటించి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గురువారం ఉదయం ఈ సంఘటనను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన కుమారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
also read: కళ్ళాపి పొడిలో ప్రమాదకర రసాయనం.. 19 మంది మృతి