Homeతెలంగాణకాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అల్లుడు, మాజీ ఐపీఎస్ ఏ.కె. ఖాన్ కుమారుడిపై క్రిమినల్ కేసు..??

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అల్లుడు, మాజీ ఐపీఎస్ ఏ.కె. ఖాన్ కుమారుడిపై క్రిమినల్ కేసు..??

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో ఒక హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసు వెలుగుచూడటం తీవ్ర సంచలనం రేపుతోంది. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు అతని సహచరులపై ఓ సినిమా నిర్మాతను మోసం చేయడంతో పాటు భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు వసూలు చేసి, తిరిగి అడిగినందుకు బౌన్సర్లతో బెదిరింపులకు దిగారనే అంశాలు ఎఫ్‌ఐఆర్‌లో చేరడం టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడైన మొహ్సిన్ ఖాన్.. కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ అల్లుడు కావడం గమనార్హం.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. వెంకట అనీష్ రెడ్డి అనే చిత్ర నిర్మాత గత రెండేళ్లకు పైగా ‘మహారాజ్ఞి’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదనపు పెట్టుబడిదారుల కోసం వెతుకుతున్న క్రమంలో ఆయనకు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని ‘సన్‌లిట్ గ్రూప్’ ఆఫీసులో మొహ్సిన్ ఖాన్, తబ్రైజ్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. గతేడాది ఆగస్టులో మొహ్సిన్ ఖాన్.. సదరు నిర్మాతకు పెద్ద ఇన్వెస్టర్లను పరిచయం చేస్తానని బలమైన నమ్మకం కలిగించాడు. ఈ మధ్యవర్తిత్వానికి గానూ మొహ్సిన్ ఖాన్ రూ.25 లక్షలు తీసుకోగా.. అతని భాగస్వామి తబ్రైజ్ మూడు విడతలుగా మరో రూ.25 లక్షలు వసూలు చేశాడు.

ఇలా మొత్తం రూ.50 లక్షలు చేతులు మారినప్పటికీ.. చెప్పినట్లుగా వారు ఎలాంటి ఇన్వెస్టర్లను తీసుకురాలేక పోయారు. దీనిపై నిర్మాత అనీష్ రెడ్డి పలుమార్లు వారిని నిలదీయగా.. సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తూ.. రకరకాల కారణాలతో తప్పించుకుని తిరగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే జూలై 1వ తేదీన నిర్మాత అనీష్ రెడ్డి.. ఇన్వెస్టర్లను అయినా చూపించాలని లేదా తన రూ.50 లక్షల నగదును పూర్తిగా రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాసన్ నగర్‌లోని సన్‌లిట్ గ్రూప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మాటలు కలవకపోవడంతో వివాదం ముదిరింది. మొహ్సిన్ ఖాన్ సదరు నిర్మాతను బలవంతంగా ఒక గదిలోకి తీసుకెళ్లి శారీరకంగా బంధించి, తీవ్రమైన అరాచకానికి తెరలేపినట్లు బాధితుడు ఆరోపించారు.

అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయుధాలు చూపిస్తూ నిర్మాతను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారని.. అదే సమయంలో మొహ్సిన్ ఖాన్ తనపై పిడిగుద్దులతో భౌతిక దాడికి పాల్పడ్డాడని అనీష్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో మరో నిందితుడు తబ్రైజ్ ఫోన్ కాల్ ద్వారా మొహ్సిన్‌తో కనెక్ట్ అయి.. దాడికి సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి నుంచి రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. మొహ్సిన్ ఖాన్, తబ్రైజ్ దాడికి పాల్పడిన బౌన్సర్లపై చీటింగ్, క్రిమినల్ బెదిరింపులు, భౌతిక దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ హై-ప్రొఫైల్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులతో పాటు సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు