Homeతెలంగాణకొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్..??

కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్..??

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ మందగించింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నప్పటికీ పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినవారు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పలుమార్లు సివిల్ సప్లైస్ కార్యాలయాలకు వెళ్లినా, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నట్లు దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. సర్కిల్ స్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగుల్లో కొందరు ఎన్నికల విధులు, మరికొందరు ఇతర ప్రభుత్వ పనుల్లో నిమగ్నం కావడంతో ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

సాంకేతిక సమస్యలు కూడా జాప్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల పనితీరులో అంతరాయాలు రావడం వల్ల దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 30 వేల కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అర్హతల పరిశీలన పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.రేషన్ కార్డు ఇప్పుడు కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థకే పరిమితం కావడం లేదు. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పలు ప్రభుత్వ పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఇది కీలక పత్రంగా మారింది. అందుకే కొత్త కార్డుల కోసం దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, అర్హులైన వారికి త్వరగా కార్డులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు