వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఓ సాధారణ పత్తి చేను ఇప్పుడు అసాధారణ వార్తలకు కేంద్రంగా మారింది. పంటలు పండాల్సిన ఆ భూమి ఇప్పుడు “బంగారు భూమి”గా మారిపోయి గ్రామమంతా ఉత్కంఠ నెలకొంది.
కలుపు తీస్తుండగా వెలుగులోకి పురాతన ఆభరణాలు
కోపాకులపాడు గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో ఇటీవల మహిళా కూలీలు కలుపు తీస్తున్న సమయంలో మట్టిలో పాతకాలపు బంగారు ఆభరణాలు కనిపించాయి. మొదట ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా, విషయం క్రమంగా గ్రామమంతా వ్యాపించింది. చివరకు భూమి యజమానికి సమాచారం చేరడంతో ఆయన ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
చరిత్రతో ముడిపడిన భూమి అంటూ ప్రచారం
ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలానికి చెందిన ఆలయాలు ఉండేవని, కాలక్రమేణా అవి నేలమట్టమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే పొలంలో దేవతా విగ్రహాలు, బంగారు నాణేలు లభించాయన్న ప్రచారం ఉండటంతో ఈ భూమిపై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో “ఇంకా నిధి దాగి ఉండొచ్చు” అన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
భూమిపై పెరిగిన డిమాండ్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనల తర్వాత ఆ పొలానికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. కొంతమంది రైతులు కౌలుకు తీసుకోవడానికి కూడా పోటీ పడుతున్నారని స్థానిక సమాచారం. “ఇక్కడ పని చేస్తే అదృష్టం కలిసొస్తుంది” అనే నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆసక్తి చూపుతున్నారు.
నిధి హక్కులపై కొత్త వివాదం
ఈ ఘటన పోలీసులకు చేరిన తర్వాత మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. భూమిని గతంలో విక్రయించిన పాత యజమాని కుమారుడు, దొరికిన బంగారంపై తమకే హక్కు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తమ పూర్వీకుల భూమి అని, ఆ ఆస్తికి సంబంధించిన నిధి కూడా తమదేనని ఆయన వాదిస్తున్నారు. దీంతో నిధి హక్కులపై చర్చ మరింత పెరిగింది.
రాత్రిపూట తవ్వకాలు – గ్రామంలో ఉద్రిక్తత
వార్త వైరల్ కావడంతో వందలాది మంది ప్రజలు ఆ పొలం వద్దకు చేరుతున్నారు. పగటిపూట పోలీసులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉండటంతో కొందరు రాత్రివేళల్లో టార్చ్ లైట్లతో పొలంలోకి చొరబడి తవ్వకాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
also read: మీ పిల్లల్నిచంపాలి అంటూ కామెంట్స్- ‘ఎక్స్’కు గుడ్‌బై చెప్పిన రాహుల్