-
రంగంలోకి జాతీయ నాయకత్వం
-
నేడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన
-
పార్టీ శ్రేణులతో సమావేశం.. దిశా నిర్దేశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి.. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా పట్టు సాధించాలని భావిస్తోంది. అయితే ముందుగా పార్టీని చక్కదిద్దాలని డిసైడ్ అయింది. పశ్చిమ బెంగాల్ లో విజయం తర్వాత.. తన తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రత్యేక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఆపరేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
-
ఆ రెండు రాష్ట్రాల ఫార్ములా..
అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే ఇప్పుడు పార్టీని చక్కదిద్దాలని చూస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా బీహార్ – బెంగాల్ ఫార్ములాను అమలు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.
పార్టీ బలోపేతంతో పాటు నాయకుల మధ్య సమన్వయం పెంచడం, త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన రాష్ట్ర నేతలతో చర్చిస్తారు. త్వరలో జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వాటిని సెమీఫైనల్స్ గా భావిస్తోంది బిజెపి. అన్ని కార్పొరేషన్ లలో విజయం సాధించి.. గట్టిపట్టు పెంచుకోవాలని చూస్తోంది.
-
పార్టీలో చక్కదిద్దాలని..
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా పార్టీలో పరిస్థితులపై హైకమాండ్ నివేదికలు తెప్పించుకుంది. అయితే ఢిల్లీకి పిలిపించి రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసిన మార్పు రాలేదు.. అందుకే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు క్రియాశీలకంగా పని చేయడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో జాతీయ అధ్యక్షుడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పార్టీలో గాడి తప్పిన పరిస్థితులను చక్కదిద్ది.. నేతలకు జాతీయ అధ్యక్షుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలుస్తోంది. పార్టీలో రాబోయే ఈ రోజులు కీలకం అని చెప్పవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.