Homeజాతీయంఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో!!

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తెలంగాణ సీఎం రేవంత్ తోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోసపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి పాల్గొన్నారు.

బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో దక్షిణాదికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం ఒక అద్భుతమైన, చారిత్రాత్మక అంశమని కొనియాడారు. “రాష్ట్రాలుగా మనం వేరైనా, దేశంగా మనమంతా ఒక్కటే” అని చాటిచెప్పేలా ఈ సమావేశం సాగిందన్నారు. “తుంగా పానం.. గంగా స్నానం” అనే సామెతను గుర్తు చేస్తూ తుంగభద్ర నది పవిత్రతను, ఈ ప్రాంత వాసులకు దీని ప్రాముఖ్యతను వివరించారు. విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి ఈ నదే రక్షణ కవచంగా నిలిచిందని, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం, జోగులాంబ, విరూపాక్ష ఆలయాలు ఈ తీరానే వెలిశాయని పేర్కొన్నారు. 2024లో తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో స్టాప్‌లాక్ గేట్ అమర్చి నీటిని వృధా కాకుండా కాపాడామని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి రూ.51 కోట్లతో మొత్తం 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి రైతుల ప్రయోజనాలను కాపాడాయని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల తుంగభద్ర, ఆల్మట్టికి ఎగువ నుంచి ప్రవాహాలు సరిగ్గా రావడం లేదని, ఈ ఏడాది నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ వన్ నేషన్-వన్ గ్రిడ్, రహదారి నెట్‌వర్క్‌లతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. దేశంలో గంగా-కావేరి నదులను అనుసంధానిస్తే భారత్‌కు తిరుగుండదన్నారు. యూపీ, ఎంపీలలో కెన్-బెత్వా ప్రాజెక్టును విజయవంతం చేసిన తరహాలోనే.. గోదావరి-కావేరి నదులను అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నీటి అవసరాలు తీరుతాయన్నారు. మొదట అంతర్గత నదులను, ఆ తర్వాత అంతర్రాష్ట్ర నదులను అనుసంధానించాలని పిలుపునిచ్చారు. 1983లో ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు కలిసి చెన్నైకి తాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాబోయే రోజుల్లో కూడా ఇదే సఖ్యతతో ముగ్గురు ముఖ్యమంత్రులం కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు