వర్షాకాలం అనగానే చల్లని వాతావరణం, వానలు గుర్తొస్తాయి. కానీ అదే సమయంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక కామన్ సమస్య కూడా ఉంది… బట్టలు సరిగా ఆరకపోవడం, వాటి నుంచి వచ్చే గలీజు వాసన. బయట ఎండ లేకపోవడం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బట్టలు ఎంతసేపు ఆరేసినా పూర్తిగా డ్రై కావు. ఈ తేమలోనే బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగి దుర్వాసనకు కారణమవుతాయి.
చాలామంది ఈ సమస్యను పట్టించుకోరు. కానీ తడి వాసన ఉన్న బట్టలు ధరించడం వల్ల చర్మానికి ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారికి అలర్జీలు, రాషెస్ వచ్చే అవకాశమూ ఉంటుంది. అందుకే వర్షాకాలంలో బట్టల సంరక్షణపై కొంచెం అదనపు శ్రద్ధ అవసరం.
అవసరానికి సరిపడా డిటర్జెంట్ మాత్రమే..
మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే డిటర్జెంట్ ఎక్కువగా వాడటం సమస్యను తగ్గించదు. మరింత పెంచుతుంది. బట్టల్లో మిగిలే డిటర్జెంట్ అవశేషాలు తేమను పట్టుకుని బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు సృష్టిస్తాయి. అందుకే అవసరానికి సరిపడా డిటర్జెంట్ మాత్రమే వాడటం మంచిది. అలాగే వాషింగ్ సమయంలో రిన్స్ సైకిల్లో కొద్దిగా వైట్ వెనిగర్ వేసుకుంటే అది సహజ డిస్ఫెక్టెంట్లా పనిచేసి దుర్వాసనను తగ్గిస్తుంది.
ఇలా ఆరబెట్టాలి…
బట్టలను ఆరబెట్టే విధానం కూడా చాలా ముఖ్యం. ఒకదానిపై ఒకటి వేసి గుంపుగా ఆరేయడం వల్ల గాలి సరిగ్గా తగలదు. దీంతో అవి ఎక్కువసేపు తడిగా ఉండి వాసన రావడం సహజం. కాబట్టి బట్టల మధ్య కొంచెం గ్యాప్ ఉండేలా ఆరేయాలి. హ్యాంగర్లు ఉపయోగించడం వల్ల గాలి సులభంగా చేరి బట్టలు వేగంగా ఆరిపోతాయి.
నీరు పూర్తిగా పిండేయాలి
ఉతికిన వెంటనే బట్టల్లో ఉండే అదనపు నీటిని పూర్తిగా తొలగించడం కూడా చాలా అవసరం. చేతితో బాగా పిండడం లేదా వాషింగ్ మెషీన్లో అదనపు స్పిన్ సైకిల్ వాడటం వల్ల ఎక్కువ భాగం నీరు తొలగిపోతుంది. దీంతో ఆరబెట్టే సమయం తగ్గుతుంది. అలాగే వాష్ చేసిన తర్వాత బట్టలను మెషీన్‌లోనే ఎక్కువసేపు వదిలేయకుండా వెంటనే బయటకు తీసి ఆరేయాలి. ఆలస్యం చేస్తే వాసన మొదలవుతుంది.
గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి
వర్షాకాలంలో చాలా సార్లు ఇంట్లోనే బట్టలు ఆరబెట్టాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో గది గాలి సరైన విధంగా తిరగడానికి కిటికీలు తెరిచి ఉంచడం, ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం మంచిది. తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించడం కూడా ఉపయోగకరం.
హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు
మందపాటి బట్టలు, టవల్స్, జీన్స్ లాంటి వాటిని త్వరగా ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కాలర్లు, స్లీవ్‌లు, మడతల దగ్గర తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా డ్రై చేయడం మంచిది. అలాగే బట్టలు దాదాపు ఆరిపోయిన తర్వాత ఐరన్ చేస్తే మిగిలిన తేమ పూర్తిగా తొలగిపోతుంది. ఐరన్ వేడి కారణంగా బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
ఇలా చేస్తే బట్టలు ఫ్రెష్ గా ఉంటాయి
ఇంకా సహజమైన పద్ధతుల్లో నిమ్మరసం లేదా కొద్దిగా బేకింగ్ సోడా వాడటం ద్వారా బట్టలకు ఫ్రెష్ స్మెల్ తీసుకురావచ్చు. ఇవి కెమికల్స్ లేకుండా సహజంగా దుర్వాసనను తగ్గిస్తాయి. ఎండ కనిపించే రోజుల్లో మాత్రం తప్పకుండా బయట ఆరేయడం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే సహజ సూర్యరశ్మి కూడా బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.
మొత్తానికి, వర్షాకాలంలో బట్టలకు దుర్వాసన రావడం సహజమైన సమస్యే అయినా, సరైన పద్ధతులు పాటిస్తే దాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే మీ బట్టలు ఎప్పుడూ శుభ్రంగా, ఫ్రెష్‌గా ఉంటాయి.
also read: సింధు జలాల ఒప్పందంపై ఉద్రిక్తతలు… వెనక్కి తగ్గనని భారత్, యుద్ధ హెచ్చరికలతో పాక్