ఒక్క ఐదు నిమిషాల వీడియో కాల్ ఆధారంగా తీసుకున్న ఒక నిర్ణయం… కేవలం తొమ్మిది రోజుల్లోనే పెద్ద వివాదంగా మారింది. తొందరపాటు పెళ్లి ఎలా జీవితాన్ని మలుపుతిప్పుతుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని జెజియాంగ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల త్వరగా వివాహం చేసుకోవాలని భావించిన అతను, బ్యూరో సూచించిన కొన్ని ప్రపోజల్స్‌ను తిరస్కరించాడు. చివరకు మరో ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతిని పరిచయం చేశారు.
ఇద్దరి మధ్య కేవలం ఐదు నిమిషాల వీడియో కాల్ మాత్రమే జరిగింది. ఆ సమయంలో యువతి గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం లేకపోయినా, మ్యారేజ్ బ్యూరో ఇచ్చిన వివరాలపై నమ్మకం ఉంచి పెళ్లికి అంగీకరించాడు. ఆరోగ్య పరిస్థితి బాగుందని, అప్పులు లేవని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పడంతో అతను విశ్వసించాడు. మూడు రోజుల్లోనే వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం యువకుడు మరియు అతని కుటుంబం కలిపి దాదాపు రూ.36 లక్షల వరకు ఖర్చు చేశారు. అందులో భాగంగా యువతికి కానుకలు, అలాగే మ్యారేజ్ బ్యూరోకు భారీ ఫీజులు చెల్లించారు.
అయితే పెళ్లి తర్వాత అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమైంది. మొదటగా బ్యాంక్‌లో క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయగా యువతికి పెద్ద మొత్తంలో అప్పు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వివరాల్లో కూడా అసమానతలు కనిపించాయి. ఇంతటితో ఆగలేదు… ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పెళ్లి తర్వాతే వెల్లడించింది. కాలేయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని చెప్పడం యువకుడికి మరో షాక్‌గా మారింది.
ఈ పరిణామాలతో పెళ్లి జరిగిన కేవలం తొమ్మిది రోజుల్లోనే అతను కోర్టును ఆశ్రయించి విడాకులు కోరాడు. తాను మోసపోయానని, పెళ్లి కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక యువతి మొదట విడాకులకు అంగీకరించినప్పటికీ, తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. భర్త తనపై ఒత్తిడి తెచ్చాడని, మానసికంగా బాధ పెట్టాడని ఆరోపిస్తూ ఆమె కూడా కేసు వేసింది. నష్టపరిహారం కింద లక్షల్లో డబ్బు డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా, ఈ వివాహం ఏర్పాటు చేసిన మ్యారేజ్ బ్యూరోపైనా యువకుడు కేసు వేశాడు. తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని ఆరోపించాడు. అయితే బ్యూరో మాత్రం తమకు ఎలాంటి తప్పు లేదని, ఇద్దరూ అంగీకరించి పెళ్లి చేసుకున్నారని చెప్పింది.
ఇప్పుడు ఈ ఘటన చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామి ఎంపికలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
also read: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కొత్త నియమాలు! అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు