- వాడుకొని వదిలేసే రకం అంటూ వైసీపీ అధినేత పై తీవ్ర విమర్శలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైయస్సార్సీపి సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వైద్యానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి సైతం పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపట్టారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై మరణంతో పోరాడుతున్న తన తండ్రిని పరామర్శించేందుకు జగన్ రాకపోవడాన్ని తప్పు పట్టారు. తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో రౌడీలతో పాటు గంజాయి బ్యాచ్ లకు ఇచ్చే విలువ కూడా తన తండ్రికి ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్న తన తండ్రి గుర్తుకు రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్రాంతి కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అవసరాల కోసమే జగన్..
ముద్రగడ పద్మనాభం కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించలేదు. దీనిపై ఆయన కుమార్తె క్రాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ అవసరాల కోసమే నాయకులను, కార్యకర్తలను, అభిమానులను జగన్మోహన్ రెడ్డి వాడుకుంటారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీ అవసరం ఉన్నంతవరకే మీకు జనం గుర్తుంటారా? మీ పార్టీ కోసం, మీ గెలుపు కోసం తన సర్వస్వాన్ని అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ఐదేళ్లపాటు ముద్రగడ కుటుంబం వైసిపి కోసం ఎంతగానో శ్రమించిందని.. తీరా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకోకపోవడం జగన్ స్వార్ధ రాజకీయాల కు నిదర్శనమని మండిపడ్డారు.
ఇతర వైసీపీ నేతలపై..
ఒక్క జగన్మోహన్ రెడ్డి పైనే మాత్రం కాదు వైసీపీలో ఇతర కీలక నేతల తీరుపై కూడా ముద్రగడ కుమార్తె క్రాంతి నిప్పులు చెరిగారు. తన తండ్రి ఆసుపత్రిలో శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతుంటే.. సొంత పార్టీకి చెందిన ఒక్క నేత కూడా వచ్చి పరామర్శించలేదని భయపడ్డారు. కనీసం ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడగలేదని ఆమె మండిపడ్డారు. వైసీపీ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. వారు కేవలం అవసరాల కోసమే ఉంటారని.. కనీస మానవత్వం, కృతజ్ఞతా భావం లేవని తేలిపోయిందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారిని జగన్ ఎలా నట్టేట ముంచుతారో చెప్పడానికి తన తండ్రి ఉదంతమే ప్రత్యక్ష సాక్షమని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా క్రాంతి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.