Homeజాతీయంమమతా బెనర్జీకి బిగ్ షాక్.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు!!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతమై.. పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితికి దారితీసింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె సొంత పార్టీలోని రెబల్ నాయకులే.. రెండు కోలుకోలేని షాక్‌లు ఇచ్చారు. ముందుగా ఆమెను టిఎంసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు తిరుగుబాటు వర్గం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులైన కీలక అనుచరులు, సీనియర్ ప్రజాప్రతినిధులు కూడా తమ వైపునకే చేరారని వెల్లడించి సంచలనం సృష్టించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఈ హైడ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ ముగిసిన వెంటనే కోల్‌కతాలోని న్యూటౌన్ పరిధిలో రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మందికి పైగా జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ మహాసభ వేదికగా రెబల్ గ్రూపునకు నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తిరుగుబాటు సమావేశంలోని వేదికపై మమతా బెనర్జీ, ఆమె వారసుడిగా భావించే అభిషేక్ బెనర్జీ చిత్రపటాలను పూర్తిగా తొలగించడం గమనార్హం.

కేవలం తృణమూల్ కాంగ్రెస్ అధికారిక ఎన్నికల గుర్తును మాత్రమే ప్రధానంగా ప్రదర్శించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా 30 మంది సభ్యులతో కూడిన నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రితబ్రత ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఈ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. “తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ సంస్థాగత మార్పులు, కమిటీ వివరాలను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తాం. ఒకవేళ మమతా బెనర్జీ పార్టీలో కేవలం ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తాం” అని రితబ్రత స్పష్టం చేశారు.

అలాగే మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు, కోల్‌కతా మాజీ మేయర్ అయిన ఫర్హాద్ హకీం అధికారికంగా మమత క్యాంప్‌ను వీడి రెబల్ గ్రూపులో చేరడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా మమతను వీడారు. నూతనంగా ఏర్పాటైన కమిటీలో ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను పార్టీ నూతన ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు. ఈ తిరుగుబాటు పరిణామంపై మమతా బెనర్జీ అధికారిక వర్గం ఇంకా స్పందించాల్సి ఉండగా.. బెంగాల్‌లో అధికారం, పార్టీ గుర్తింపు కోసం ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు