తెలుగు రాష్ట్రాలు, తమిళనాడును అత్యంత వేగవంతమైన రైల్వే వ్యవస్థతో అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక హైదరాబాద్- అమరావతి- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపడుతోంది. తాజాగా సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ప్రకారం ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనున్నట్లు సమాచారం. ప్రారంభ దశలో రావెల సమీపంలో ప్రతిపాదిత విమానాశ్రయం వద్ద స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించినప్పటికీ, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు మరింత ప్రయోజనం చేకూరేలా అమరావతినే ప్రధాన కేంద్రంగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మీదుగా కారిడార్‌ను ఖరారు చేస్తూ తుది స్థాన నిర్ధారణ సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందినట్లు సమాచారం.
హైదరాబాద్- అమరావతి- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సాగే ఈ ప్రాజెక్టులో మొత్తం 18 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ బుల్లెట్ రైలు మార్గం చెన్నైలో ముగియనుంది. తెలంగాణలో సుమారు 180.32 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం జరగనుండగా, హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కారిడార్ అత్యధికంగా 518.54 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రాష్ట్రంలో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు. తమిళనాడులో సుమారు 61.23 కిలోమీటర్ల మేర ఈ మార్గం విస్తరించనుండగా, తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్, మింజూర్, చెన్నై సెంట్రల్ ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం గంటల కొద్దీ సమయం తీసుకునే ప్రయాణాలు కేవలం కొన్ని నిమిషాలకు పరిమితం కానున్నాయి. అంచనాల ప్రకారం హైదరాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ రైలులో కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఈ ప్రయాణానికి సుమారు 12 గంటల వరకు సమయం పడుతుండగా, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 9 గంటల సమయం ఆదా కానుంది. ఇది వ్యాపార, ఉద్యోగ, విద్యా రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
అలాగే హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గనుంది. ప్రస్తుతం సాధారణ రైళ్ల ద్వారా 6 గంటలకుపైగా పట్టే ఈ ప్రయాణాన్ని బుల్లెట్ రైలు కేవలం 70 నిమిషాల్లో పూర్తి చేయనుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు తరచుగా ప్రయాణించేందుకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
మరోవైపు అమరావతి నుంచి చెన్నై వరకు ప్రయాణం కూడా వేగవంతం కానుంది. ప్రస్తుతం 6 నుంచి 7 గంటల వరకు పట్టే ఈ మార్గాన్ని బుల్లెట్ రైలు కేవలం 112 నిమిషాలు అంటే 1 గంట 52 నిమిషాల్లో పూర్తి చేయగలదు. దీంతో దాదాపు 4 నుంచి 5 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మధ్య ఆర్థిక, పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త ఊపిరి లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో అత్యాధునిక రవాణా వ్యవస్థకు ఇది మరో కీలక అడుగుగా నిలవనుంది.
ALSO READ: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫుట్‌బాల్