పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులను కొట్టడం, హింసించడం పోలీసుల అధికారిక విధుల్లో భాగం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాదని కూడా పేర్కొంది.
కోర్టు ఉద్యోగి కస్టడీ మృతి చెందిన కేసులో కీలక తీర్పు
ఇండోర్‌కు చెందిన పంకజ్ వైష్ణవ్ అనే జిల్లా కోర్టు ఉద్యోగి కస్టడీలో మృతి చెందిన కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు తమపై జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
విచారణ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా జస్టిస్ గజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో జరిగే మరణాలు ఏ సమాజానికైనా తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమన్నారు. నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించడం, కేసులకు సంబంధించిన రికార్డులను తారుమారు చేయడం వంటి చర్యలు పోలీసుల విధి నిర్వహణ కిందకు రావని స్పష్టం చేశారు. పోలీసులు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు వారికి లేదని కోర్టు అభిప్రాయపడింది. కస్టడీలో ఉన్న వ్యక్తుల హక్కులను కాపాడటం కూడా పోలీసుల బాధ్యతేనని న్యాయస్థానం గుర్తు చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో కూడా బాధితుడి శరీరంపై గాయాలున్నట్లు, అవి హింస కారణంగా జరిగి ఉండొచ్చని సూచించినట్లు కోర్టు ప్రస్తావించింది. దీంతో ఈ వ్యవహారంలో న్యాయపరమైన విచారణ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు తాజా తీర్పు కస్టడీ హింస, కస్టోడియల్ మరణాలపై కఠిన వైఖరిని మరోసారి స్పష్టంచేసిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.