-
జనసేన పార్టీలో ఉక్కపోత…
-
లింగమనేనికి రాజ్యసభ సీటుపై రగిలిపోతున్న కేడర్…!
క్రైమ్ మిర్రర్, ఏపీ స్టేట్ బ్యూరో: జనసేన పార్టీలో రాజ్యసభ సీటు రగడ సృష్టిస్తుందా.? లింగమలేని రమేష్ కు సీటు కేటాయించడం పట్ల పార్టీలోనే ముఖ్య నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారా.? అంటే అవునన్న సమాధానమే ఆ పార్టీ ముఖ్య నాయకుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీలో రాజ్యసభ సీటు వ్యవహారం దుమారం రేపుతోంది..
తొలినుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే జనసేన పార్టీకి లభించిన ఏకైక రాజ్యసభ సీటును కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు ఆ పార్టీ కేటాయించింది. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీకి చెందిన ముఖ్య నాయకులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన పార్టీలో కనీసం సభ్యత్వం లేని నాయకుడికి ఏకంగా రాజ్యసభ సీటును ఇవ్వడం పట్ల తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి.. మంత్రి పదవులపై నేతల్లో అసహనం.!
ఇదే విషయాన్ని పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా జనసేన పార్టీ అధినేతను ప్రశ్నించారు. అయితే ఈ తరహా ప్రశ్నలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన అధినేత ఆదేశాలను పాటించాల్సిందే అంటూ స్పష్టం చేశారు. ఈ పోస్ట్ పైన సామాజిక మాధ్యమాల్లో జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కనీసం పార్టీ క్యాడర్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు బహిరంగంగానే తీవ్రస్థాయిలో పార్టీ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీకి కనీసం పనిచేయని వ్యక్తులకు ఎలా రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైసీపీ సోషల్ మీడియా ప్రచారంతో ఉక్కిరిబిక్కిరి..
మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా రాష్ట్రానికి లభించిన నాలుగు రాజ్యసభ స్థానాలను తెలుగుదేశం పార్టీకే కేటాయించారంటూ ప్రచారం చేస్తోంది. జనసేన పార్టీకి కేటాయించిన సీటును కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికే ఇచ్చారంటూ విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. గతంలో లింగమనేని రమేష్ సీఎం చంద్రబాబు నాయుడుకి కరకట్ట మీద ఇల్లు కట్టించి ఇచ్చారని, అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు మనిషికి ఇచ్చినట్టేనంటూ పెద్ద ఎత్తున వైసిపి విమర్శలు చేస్తోంది.
వైసిపి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా జనసేన నుంచి లేకుండా పోయింది. జనసేనలో కూడా ఇదే తరహా భావన ఉండడం ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. లింగమనేని రమేష్ కు రాజ్యసభ సీటును కేటాయించడానికి గల కారణాలు, పార్టీకి ఆయన చేసిన సేవలు గురించి ఒక ప్రకటన విడుదల చేసి ఉన్న జనసైనికులు అర్థం చేసుకునేవారు.
Also Read: సీఎం విజయ్‌కే చెక్‌మేట్ చెప్పిన ప్రజ్ఞానంద
కానీ నాగబాబు వంటి నేతలు అధినేత నిర్ణయం తీసుకుంటారు దాన్ని పాటించాల్సిందే అన్నట్టుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు మరింతగా జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు కనీసం తావు లేకుండా ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటే వాటికి కట్టుబడి ఉండాల అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనా రాజ్యసభ సీటు వ్యవహారంలో జనసేన డిఫెన్స్ లో పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి జనసేన ఎలా బయటపడుతుందో చూడాలి. ఇదెలా ఉంటే లింగమనేని రమేష్ కు రాజ్యసభ కేటాయించడం వెనుక భారీ ఎత్తున ఆర్థిక లావాదేవులు జరిగినట్లు వైసిపి ఆరోపిస్తోంది. కోట్లాది రూపాయల లావాదేవీల జరిగిన నేపథ్యంలోనే లింగమనేని రమేష్ కు ఈ సీటును కేటాయించారన్న ఆరోపణలను వైసీపీ చేస్తుండడంతో వాటిని ఎదుర్కోలేక జనసేన ఇబ్బంది పడుతోంది.
పార్టీ కార్యకర్తల్లో అపోహలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Also Read: ప్రేమా…? మోజా…? ప్రతీకారమా…?