హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. మహిళా సంఘాలకు బస్సులు అందజేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులోనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం బస్సులో వస్తుండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సభ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురవడంతో ప్రాంగణమంతా తడిసిపోయింది.
బస్సు దిగిన అనంతరం వేదిక వైపు నడిచి వెళ్లే సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క కూడా వర్షంలో తడుస్తూనే వేదిక వద్దకు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది గొడుగులు ఏర్పాటు చేసినప్పటికీ, కుండపోత వర్షం కారణంగా నేతలు పూర్తిగా తడిసిపోయారు. ఇక సభకు హాజరైన మహిళలు కూడా వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వర్షం నుంచి రక్షణ కోసం షెడ్ల కిందకు వెళ్లగా, మరికొందరు వర్షాన్నే లెక్కచేయకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం కార్యక్రమం వర్షం మధ్యనే కొనసాగింది. భారీ వర్షం సభకు కొంత అంతరాయం కలిగించినప్పటికీ, కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించారు