శ్రీనగర్ నుంచి లద్దాఖ్‌కు వెళ్లే జాతీయ రహదారి-1 హిమాలయ పర్వతాల మధ్యుగా సాగుతుంది. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే 13 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న జోజిలా పాస్ ను దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో భారీగా మంచు కురవడం వల్ల ఈ రహదారి ఏడాదిలో చాలా నెలలు మూసివేయబడుతుంది. దీంతో లద్దాఖ్, కార్గిల్, ద్రాస్ ప్రాంతాల ప్రజలు రవాణా సమస్యలు ఎదుర్కొంటుంటారు. పర్యాటక రంగంతో పాటు సైనిక రవాణాపైనా ప్రభావం పడుతుంది.
జోజిలా టన్నెల్ తవ్వకం పూర్తి
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం జోజిలా టన్నెల్ ప్రాజెక్టును చేపట్టింది. శ్రీనగర్ సమీపంలోని బాల్తాల్ నుంచి కార్గిల్ జిల్లా మీనామార్గ్ వరకు సుమారు 13.15 కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రూ.6,808 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. 2020 అక్టోబర్‌లో ప్రారంభమైన టన్నెల్ తవ్వక పనులు తాజాగా పూర్తయ్యాయి. ప్రస్తుతం అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ కెమెరాలు, భద్రతా సదుపాయాల ఏర్పాటు వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత టన్నెల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
నాలుగు గంటల ప్రయాణం ఇక 20 నిమిషాల్లోనే..
జోజిలా టన్నెల్ ప్రారంభమైతే బాల్తాల్ నుంచి మీనామార్గ్ మధ్య దూరం సుమారు 27 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రస్తుతం నాలుగు గంటలకు పైగా పట్టే ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఏడాది పొడవునా శ్రీనగర్-లద్దాఖ్ మధ్య రవాణా సౌకర్యం కొనసాగడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.
జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ కు జీవనాధారం
టన్నెల్ ఫైనల్ బ్రేక్‌త్రూ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోజిలా టన్నెల్ దేశ మౌలిక వసతుల రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇది కేవలం రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదని, జమ్మూ-కశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలకు జీవనాధారంగా మారుతుందని చెప్పారు. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టన్నెల్ ఆసియాలోనే అతిపెద్ద డబుల్ రోడ్ సొరంగ మార్గంగా గుర్తింపు పొందుతోంది. దీనివల్ల పర్యాటకం, వాణిజ్యం, రక్షణ రంగాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది.