-
శంషాబాద్‌లో విషాదం…!
-
ఉరి వేసుకుని వివాహిత మృతి..!
-
సంతానం లేకపోవడం కారణమా?
Crime Mirror, Rangareddy: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలు స్వప్న (36), గృహిణి. ఆమెకు 2021 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో శంషాబాద్‌కు చెందిన శ్రీకాంత్ అలియాస్ శివతో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆమె భర్తతో కలిసి అత్తమామల వద్దే నివసిస్తూ వచ్చేది. శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఓ హోటల్లో లాండ్రీ మేనేజర్‌గా పనిచేసేవాడు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ తన అన్నతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి స్వప్న తన అత్తమామలతో కలిసి గొల్లపల్లిలోనే ఉంటోంది. ఆమె ఇంటి మొదటి అంతస్తులో ఒంటరిగా నివసించేది.
స్వప్నకు సంతానం లేకపోవడం ఆమెను మానసికంగా కలవరపెడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయంపై ఆమె తరచూ బాధపడుతూ ఉండేదని తెలిసింది.
ఈ నెల 2వ తేదీ ఉదయం స్వప్న తన భర్తతో పాటు తన చెల్లితో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో సంతానం లేని విషయం గురించి ఆమె తీవ్రంగా భావోద్వేగానికి లోనై ఏడ్చిందని సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
సాయంత్రం ఆమె అత్త స్వర్ణలత గదికి వెళ్లి పలుమార్లు తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్వప్న ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సంతానం లేకపోవడం వల్ల కలిగిన మనస్తాపమే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.