బ్రిటన్ న్యాయ చరిత్రలో అత్యంత కాలం కొనసాగిన విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచిన కేసులో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ కు భారీ ఊరట లభించింది. దాదాపు 23 సంవత్సరాల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఆమెకు 6.6 మిలియన్ పౌండ్లు.. భారత కరెన్సీలో రూ.70 కోట్లకు పైగా పరిహారం ఇవ్వాలని బ్రిటన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
2002లో కోర్టును ఆశ్రయించిన వర్ష
61 ఏళ్ల వర్షా గోహిల్, తన భర్త బద్రేశ్ గోయల్ నుంచి విడాకులు కోరుతూ 2002 మే నెలలో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు వివిధ దశల్లో విచారణ కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా భర్తకు చెందిన ఆస్తుల వివరాల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. వర్షా తరఫు వాదన ప్రకారం, విడాకుల కేసు దాఖలు చేసిన సమయంలో బద్రేశ్ గోయల్ తన వద్ద ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను కోర్టుకు పూర్తిగా వెల్లడించలేదని ఆరోపించారు. కొంత ఆస్తిని దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె న్యాయపోరాటం సాగించారు. ఈ అంశంపై కోర్టు చాలా కాలం పాటు విచారణ జరిపింది.
రూ. 70 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశం
అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత బద్రేశ్ గోయల్‌కు చెందిన చట్టబద్ధమైన ఆస్తులను కోర్టు గుర్తించింది. ఆ ఆస్తుల్లో వర్షాకు కూడా హక్కు ఉందని భావించిన న్యాయస్థానం, మొత్తం ఆస్తి విలువలో 23.82 శాతం వాటాను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. దీని ప్రకారం వర్షాకు 6.6 మిలియన్ పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ.70 కోట్లకు పైగా విలువ చేస్తుందని తెలుస్తోంది. దీంతో రెండు దశాబ్దాలకుపైగా సాగిన ఈ న్యాయపోరాటానికి ముగింపు లభించినట్టైంది.
సుదీర్ఘ విడాకుల కేసుగా గుర్తింపు
ఈ కేసు బ్రిటన్‌లో సుదీర్ఘంగా కొనసాగిన విడాకుల వ్యవహారాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా, ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసిన కేసుగా కూడా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.