అనంతపురం,క్రైమ్‌మిర్రర్: గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై మంగళవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే గుత్తి పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన ఫిట్‌నెస్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
రాత్రిపూట లాంగ్ రూట్ బస్సుల్లో డ్రైవర్ అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది