దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నుంచి ఇప్పటికీ సరైన పాఠాలు నేర్చుకోకపోవడం బాధాకరమని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగిన సందర్భంగా ధర్మాసనం ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా నీట్ పరీక్షల భద్రతపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 14న ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసినట్లు, వాటిని ఎన్టీఏ అంగీకరించినప్పటికీ అమలు విషయంలో ఏం చర్యలు తీసుకుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో మూడు రోజులలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల పారదర్శకత, భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కూడా సూచించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది తన్వి దూబె వాదనలు వినిపించారు. నీట్ యూజీ దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలలో ఒకటని ఆమె తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలపై సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రశ్నపత్రం లీక్ వంటి ఘటనలు విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి నీట్ పరీక్షల నిర్వహణపై చర్చకు దారితీసింది.