భారతీయ సినీ చరిత్రలో చాలా తక్కువ వయసులోనే అసాధారణ గుర్తింపు పొందిన నటీమణుల్లో మోనిషా ఉన్ని పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందం, సహజమైన నటన, నాట్య ప్రతిభతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన ఆమె జీవితం మాత్రం ఎంతో చిన్న వయసులోనే విషాదాంతమైంది. తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని, భవిష్యత్తులో దక్షిణ భారత సినీ రంగాన్ని శాసించే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటి ప్రయాణం అనూహ్యంగా ముగిసిపోయింది.
మోనిషా ఉన్ని కేరళకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని ప్రముఖ మోహినియాట్ట కళాకారిణి కాగా, తండ్రి నారాయణ్ ఉన్ని. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న మోనిషా కేవలం 5 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్య శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసి చాలా చిన్న వయసులోనే తెరపై కనిపించారు. ఆమె నటించిన తొలి చిత్రం నఖక్షతంగళ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి గాను కేవలం 15 ఏళ్ల వయసులోనే ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుని చరిత్ర సృష్టించారు. ఆ విభాగంలో అత్యంత చిన్న వయసులో ఈ గౌరవం అందుకున్న నటీమణుల్లో ఆమె ఒకరిగా నిలిచారు.
తొలి విజయానంతరం మోనిషా వెనక్కి తిరిగి చూడలేదు. మలయాళం, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుని సుమారు 6 ఏళ్ల కాలంలో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. ఆమె ముఖంలోని అమాయకత్వం, కళ్లలోని భావప్రకటన, సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కాలంలోనే భవిష్యత్తు స్టార్ హీరోయిన్‌గా సినీ పరిశ్రమ ఆమెను చూసింది. ఒక వైపు నటన, మరోవైపు నృత్య ప్రతిభతో వేగంగా ఎదుగుతున్న సమయంలో ఆమె కెరీర్ శిఖరాగ్రానికి చేరుకుంటుందని అందరూ భావించారు.
అయితే విధి మరో నిర్ణయం తీసుకుంది. 1992లో అలప్పుజ వైపు ప్రయాణిస్తున్న సమయంలో మోనిషా ఉన్ని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు వెనుక సీటులో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రమాద సమయంలో ఆమె తల్లి కూడా అక్కడే ఉండటం. తన కళ్ల ఎదుటే కుమార్తెను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని విషాదంగా మారింది.
మోనిషా మరణం తర్వాత కూడా ఆమె నటించిన కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. అందులో మూన్రావతి కణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించి, ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాల్సిన సమయంలో జరిగిన ఈ విషాదం దక్షిణ భారత సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నేటికీ మోనిషా ఉన్ని పేరు వినగానే ప్రేక్షకులకు ప్రతిభ, అందం, అసంపూర్తిగా ముగిసిన ఒక సినీ ప్రయాణం గుర్తుకొస్తుంది.
ALSO READ: బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త