వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకోవాలనుకునే రైతులకు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక అవకాశం కల్పిస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాల అవసరాల కోసం రైతులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి అగ్రి గోల్డ్ లోన్ పొందవచ్చు. వేగంగా రుణం మంజూరు చేయడం, తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన చెల్లింపు విధానం ఈ పథకానికి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ రుణం కింద ఒక్కో వినియోగదారుడు గరిష్టంగా రూ.50 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. కనీసం 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఈ సదుపాయం పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అలాగే తాకట్టు పెట్టే బంగారం అంచనా విలువలో గరిష్టంగా 80 శాతం వరకు రుణం మంజూరు చేయబడుతుంది. అయితే ఈ రుణాన్ని వ్యవసాయం, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
ఈ పథకంలో రైతులకు మరిన్ని సడలింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల ద్వారా విక్రయించిన బంగారు నాణేలను కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. అయితే వాటి పరిమితి గరిష్టంగా 50 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. భారతీయ పౌరులై, తాకట్టు పెట్టే బంగారు ఆభరణాల యజమానులై ఉన్నవారే ఈ రుణానికి అర్హులు. రుణ కాలపరిమితి గరిష్టంగా 12 నెలలుగా నిర్ణయించారు. రైతుల ఆదాయం, పంట చేతికి వచ్చే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చెల్లింపు విధానాన్ని రూపొందించారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత అసలు లేదా వడ్డీ చెల్లించే అవకాశం కల్పించారు. ముఖ్యంగా గడువుకు ముందే రుణాన్ని పూర్తిగా చెల్లించినా ఎలాంటి ముందస్తు ముగింపు లేదా ముందస్తు చెల్లింపు జరిమానాలు ఉండవని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇక ప్రాసెసింగ్ రుసుముల విషయంలో కూడా రైతులకు ఊరట కల్పించారు. సాధారణంగా రుణాలపై పత్రాల పరిశీలన, దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం బ్యాంకులు అదనపు రుసుములు వసూలు చేస్తాయి. కానీ అగ్రి గోల్డ్ లోన్ కింద రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే రైతులకు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము ఉండదు. రూ.3 లక్షలకు మించి తీసుకునే రుణాలపై మాత్రమే వర్తించే రుసుములు, సంబంధిత పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు కూడా రుణ పరిమాణం ఆధారంగా అమలు అవుతాయి. వ్యవసాయ రంగానికి తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన రైతులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
ALSO READ: భోగాపురం విమానాశ్రయం రెడీ.. జూలై నుంచి సేవలు ప్రారంభం