క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- దేశంలో సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన ఈ పార్టీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సామాన్యుడు పార్టీగా అవతరిస్తోంది. పార్టీ ఏర్పాటైన ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకొని దేశంలోని అగ్ర పార్టీలుగా వెలుగొందుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను అధిగమించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో నిరుద్యోగ యువతకు సరైన వేదికగా ఈ పార్టీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నిలుస్తోంది. ప్రతిరోజు లక్షలాది మంది కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జెన్జీ యువత విభిన్న రకాలుగా తమ నిరసనను తెలియజేస్తూ వస్తుంటే.. భారత్లోను ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ద్వారా యువత తమ ఆవేదనను, అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అసలు ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ.?
కాక్రోచ్ అంటే బొద్దింక. బొద్దింక పేరుతో పార్టీ పెట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. కొద్దిరోజుల కిందట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి ఈ పార్టీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రారంభమైంది. ‘నిరుద్యోగులు సోమరిపోతులుగా, బొద్దింకల్లా తయారయై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీస్కె ఆన్లైన్ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి కారకుడయ్యారు. సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్ వ్యంగ్య రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విశ్వరూపం దాలుస్తోంది. వ్యవస్థలపై రాజకీయ పార్టీల అవినీతి వ్యవహారాలపై జెన్ జీ ఆగ్రహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా నిలిచింది ఫలితమే ఐదు రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీకి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది. దేశంలో అన్ని ప్రధాన పార్టీల ఖాతాలకు ఉన్న ఫాలోవర్స్ కంటే అత్యధిక ఫాలోవర్స్ ను సాధించి కాక్రోచ్ జనతా పార్టీ సత్తాను చాటింది. ప్రస్తుతం వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో 13.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, పది ఏళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపికి 8.8 మిలియన్ల మంది ఫాలోవర్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రెండు పార్టీల ఫాలోవర్ల సంఖ్య ఈ స్థాయికి రావడానికి అనేక ఏళ్ల సమయం పట్టింది. కానీ, ఐదు రోజుల క్రితం ఒక అసహనంలో నుంచి పుట్టుకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గురువారం రాత్రికి 14.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సాధించి అతిపెద్ద ఫాలోవర్ భారీ సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ నిలిచింది. శుక్రవారం ఉదయానికి 19 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను ప్రస్తుతం కాక్రోచ్ పార్టీ సాధించింది. ఈ పార్టీ ప్రస్తుతం యువత చేత, యువత కోసం, యువతే నడిపే ఆన్లైన్ పార్టీగా విస్తృత ప్రజాధరణ పొందుతోంది. ఇన్స్టాగ్రామ్ లో సీజేపీ ప్రభంజనం కొనసాగుతూ ఉండడంతో యువత ఈ పార్టీ పట్ల ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను గురువారం నిలిపివేయడం గమనార్హం. దీనిపై వెంటనే స్పందించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీస్కే ఊహించినట్టుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారత దేశంలో నిలిపివేశారని ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఖాతాను హ్యాక్ చేయడానికి బుధవారం ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే వెంటనే ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో మరో ఖాతాను తెరిచి విమర్శకులపై వ్యంగ్య వ్యాఖ్యలను ఆయన చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన అభిజిత్ దీస్కే ఎవరు అన్న దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2020లో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఈయన పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ వర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థిగా ఉన్నారు. ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయడానికే సీజేపీని ఏర్పాటు చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నిరుద్యోగ యువత కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది ఇన్స్టాగ్రామ్ లో ఈ పార్టీకి సంబంధించిన అకౌంట్ ను ఫాలో అవుతూ తమలోని అసహనాన్ని తెలియజేస్తున్నారు.