Homeఆంధ్ర ప్రదేశ్48 డిగ్రీల టెంపరేచర్.. ఈ టైంలో బయటకు రావొద్దు..!

48 డిగ్రీల టెంపరేచర్.. ఈ టైంలో బయటకు రావొద్దు..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత, మధ్యాహ్నానికి అగ్నిగుండంలా మారుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే 22 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉంది. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం, ప్రకాశం జిల్లా అద్దంకి తదితర ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను హడలెత్తించింది. రాష్ట్రంలోని దాదాపు 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, మరో 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో పగటిపూట రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వేడి గాలుల ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

తెలంగాణలో రోహిణి కంటే ముందే ముదిరిన ఎండలు

సాధారణంగా రోహిణికార్తె ప్రవేశిస్తే ఎండలు తీవ్రంగా ఉంటాయని అంటుంటారు, కానీ తెలంగాణలో ఈసారి రోహిణికార్తె కంటే ముందే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. నేడు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్, హన్మకొండ, రామగుండం, భద్రాచలం తదితర ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి.

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్

ఇక భాగ్యనగర ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. హైదరాబాద్ నగరంలో సాధారణంగా ఇంతటి తీవ్రత ఉండకపోయినా, ఈసారి మాత్రం వడగాలులు, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో మునుపెన్నడూ లేని విధంగా 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు