క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను కానీ ఎవరైనా విమర్శిస్తే సామాజిక మాధ్యమాలు వేదికగా పోస్టులు పెడుతూ వారిని వెంటాడుతూ వస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే సోషల్ మీడియాలో వైసిపి ఎప్పుడూ బలంగానే ఉంటూ వస్తోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆరా తీస్తే తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు వైసిపి సోషల్ మీడియా జోష్ మీద ఉండడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారా.? అయితే ఆ వివరాలు చదివేయండి.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు అంటే.?
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలంటూ పార్టీ నాయకులు నుంచి ఒత్తిడి వస్తోంది అంటూ అమిత్ షా కు ఇద్దరు నేతలు చెప్పారని.. దీనిపై స్పందించిన అమిత్ షా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడాల్సిన అవసరం మీకు లేదంటూ అమిత్ షా చెప్పారంటూ నాగేశ్వర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. దీనిపై సామాజిక మాధ్యమాలు వేదికగా వైసిపి సోషల్ మీడియా పోస్టింగులు పెడుతూ తెగ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని, జగన్మోహన్ రెడ్డిని జైలులో వేయాలన్న కోరిక కూటమి నాయకులకు తీరదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రధాన మోడీకి జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అని, చంద్రబాబు అవసరార్థం వచ్చిన సన్నిహితులు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించుకోవాలంటే కూటమి నాయకులను ఎద్దేవా చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇది కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న పలుకుబడి అంటూ మరికొన్ని కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ప్రధాన మోడీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకుంటూ వైసీపీ క్యాడర్ తెగ సంబరపడుతోంది. ఒకరకంగా స్టబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు యాక్టివ్ అయ్యేలా చేశాయని కొందరు పేర్కొంటున్నారు.
విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ స్పష్టం చేసిన నాదెండ్ల..
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తనకు గౌరవం ఉందని, అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారో తనకు అర్థం కావడంలేదని, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. వాస్తవాలతో సంబంధం లేకుండా చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టిడిపి, జనసేనకు చెందిన యాక్టివిస్టులు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి చెందిన ఎనలిస్ట్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, డబ్బులకు అమ్ముడుపోయి ఈ తరహా వ్యాఖ్యానాలు చేస్తున్నారో అంటూ మరికొందరు పోస్టింగులు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది.