•పుష్కరాల హడావుడిలో గ్రామ సమస్యలను మర్చిపోయిన అధికారులు
•పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బందిపై గ్రామస్తుల ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :-జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామస్తులు తీవ్రమైన తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ప్రచారం చేసిన మిషన్ భగీరథ పథకం గ్రామ ప్రజలకు మాత్రం అందని ద్రాక్షగా మారింది. ఇదే సమయంలో సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా నిమగ్నమై గ్రామాల అసలు సమస్యలను పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్కరాల ప్రచారం, ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు, పాలకులు సూరారం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరారం గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొన్నప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రోజుల తరబడి రాకపోయినా సమస్య పరిష్కారానికి అధికారులు, సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. “గ్రామంలో నీళ్లు రావడం లేదు.. కానీ అడిగితే సమాధానం చెప్పేవారు లేరు” అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల పనుల్లో అధికారులు బిజీగా ఉండగా గ్రామ ప్రజల ప్రాణాధారమైన నీటి సమస్యను పూర్తిగా గాలికొదిలేశారంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని సూరారం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.