అవసరాల కోసం చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, ఇతర కారణాల వల్ల కొంతమంది సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. అలాంటి సమయంలో బ్యాంకుల రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎక్కువవుతున్నాయన్న ఫిర్యాదులు తరచూ వినిపిస్తున్నాయి. రోజుకు ఎన్నోసార్లు ఫోన్ చేయడం, దురుసుగా మాట్లాడటం, బెదిరించడం, కుటుంబ సభ్యుల ముందు అవమానించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు బ్యాంకు సిబ్బంది కూడా వినియోగదారులతో కఠినంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కొత్త నియమాలు తీసుకొచ్చిన ఆర్బీఐ
ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు తీసుకోబోతోంది. తాజాగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులు – బాధ్యతాయుత వ్యాపార నియమావళి సవరణ మార్గదర్శకాలు-2026’ పేరుతో కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్ పై ప్రజల నుంచి అభిప్రాయాలను ఈ నెల 31 వరకు స్వీకరించనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.
రికవరీ ఏజెంట్ల తప్పులకు బ్యాంకులదే బాధ్యత!
ఈ కొత్త మార్గదర్శకాలలో రికవరీ ఏజెన్సీలు, రికవరీ ఏజెంట్లకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. ఎవరు రికవరీ ఏజెంట్గా పనిచేయాలి? వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వినియోగదారులతో ఎలా మాట్లాడాలి? వంటి అంశాలపై కఠిన నియమాలు రూపొందించారు. ముఖ్యంగా కస్టమర్లను వేధించే విధంగా ప్రవర్తిస్తే బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోలేని విధంగా నిబంధనలు చేర్చారు.
ఇకపై రికవరీ ఏజెంట్లు చేసే తప్పులకు కూడా సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వినియోగదారుల గౌరవాన్ని కాపాడేలా, ఒత్తిడి లేకుండా రుణాల వసూళ్లు జరగాలన్నదే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశమని ఆర్బీఐ వెల్లడించింది. దీంతో రుణగ్రహీతలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.