దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో దేశంలోని రిటైల్ మెడికల్ దుకాణాలు ఒక రోజు పాటు మూసివేయనున్నట్లు తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మందుల అమ్మకాలకు నిరసనగా..
ఇటీవల ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థలు వేగంగా పెరుగుతున్నాయి. మొబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా మందులు ఇంటికే పంపిస్తున్నాయి. అయితే, వీటి వల్ల చిన్న మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటోందని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన నియంత్రణ లేకుండా మందులు అమ్మితే ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మందులు విక్రయించడం పెద్ద సమస్యగా మారుతోందని అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై ఇటీవల AIOCD ప్రతినిధులు కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. ఈ-ఫార్మసీల నిర్వహణ, లైసెన్సులు, మందుల అమ్మకాల పర్యవేక్షణపై తమ అభ్యంతరాలను వివరించారు. దీనిపై అన్ని చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, సమస్యపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఒక రోజు బంద్ నిర్వహించాలని AIOCD నిర్ణయించింది.
బంద్ కు దూరంగా కొన్ని సంఘాలు
అయితే, ఈ బంద్‌కు దేశ వ్యాప్తంగా పూర్తి మద్దతు లభించడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లదాఖ్ రాష్ట్రాల మెడికల్ షాప్ అసోసియేషన్లు తాము బంద్‌లో పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దీనికి సంబంధించిన లేఖలను కూడా సమర్పించాయి. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొన్ని సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధాన ఫార్మసీ చైన్ స్టోర్లు, ఆస్పత్రులలోని మెడికల్ షాపులు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీ ఔట్ లెట్లు సాధారణంగానే పనిచేయనున్నాయి. దీంతో అత్యవసర మందుల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.