HomeతెలంగాణTG ICET 2026: తెలంగాణ ఐసెట్-2026 తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా పూర్తి.. 90 శాతానికి...

TG ICET 2026: తెలంగాణ ఐసెట్-2026 తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా పూర్తి.. 90 శాతానికి పైగా హాజరు!

తెలంగాణ ఐసెట్–2026 తొలి రోజు పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యాయని కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఉదయం జరిగిన తొలి సెషన్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం సెట్ కోడ్ ‘ఏ’ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టినట్లు చెప్పారు. ప్రతి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం ద్వారా సమన్వయం మెరుగుపడటంతో పాటు, పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం కూడా పెరిగిందన్నారు.

ఉదయం సెషన్‌కు మొత్తం 18,783 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, అందులో 16,965 మంది పరీక్ష రాశారు. 1,818 మంది గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం 90.3గా నమోదైంది. ఈ సెషన్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 69 కేంద్రాల్లో నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌కు మొత్తం 18,712 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 17,122 మంది హాజరై పరీక్ష రాశారు. 1,590 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ సెషన్‌లో హాజరు శాతం 91.5గా నమోదైంది. రెండు సెషన్‌లను కలిపి తొలి రోజు మొత్తం 37,495 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 34,087 మంది పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ తెలిపారు. మొత్తం హాజరు శాతం 90.09గా నమోదైంది. అలాగే 3,487 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు.

రెండో సెషన్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం సెట్ కోడ్ ‘ఈ’ను తెలంగాణ ఐసెట్–2026 చైర్మన్, వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాలా పురుషోత్తం, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు కూడా సమయానికి కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదన్నారు. మొత్తం మీద తెలంగాణ ఐసెట్–2026 తొలి రోజు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు