HomeజాతీయంHardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. కేంద్రమంత్రి హర్‌ దీప్ సింగ్ పురీ...

Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. కేంద్రమంత్రి హర్‌ దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!

పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై ప్రస్తుతం ఎలాంటి హామీ ఇవ్వలేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ తెలిపారు. అయితే గత నాలుగేళ్లుగా భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచకుండా ప్రభుత్వం నియంత్రించిందని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, దేశ ప్రజలపై భారం పడకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

ప్రధాని సూచనలు పాటించాలి!

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు ఇచ్చిన సూచనలను కూడా మంత్రి ప్రస్తావించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌ను అవసరానికి మాత్రమే వినియోగించాలని, ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని, విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని చేసిన పిలుపును కేవలం సూచనగా కాకుండా ఒక హెచ్చరికగా భావించాలని అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోందని, దాని నుంచి దేశాన్ని రక్షించేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.

విమర్శలను ఖండించిన హర్‌ దీప్ సింగ్ పురీ

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచలేదనే విమర్శలను కూడా పురీ ఖండించారు. “గత 75 రోజులుగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయినా నాలుగేళ్లుగా ఇంధన ధరలు పెంచని దేశం భారత్ మాత్రమే. చివరిసారి 2022లో ధరలను సవరించాం. ఆ తర్వాత కూడా లోక్‌ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఎన్నికలకు, ఇంధన ధరలకు ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.

ఇంధన కొరతపై ఆందోళన వద్దు!

దేశంలో ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని చెప్పారు. అలాగే 45 రోజుల అవసరాలకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, రోజుకు 35 నుంచి 36 వేల టన్నులుగా ఉన్న ఎల్‌పీజీ ఉత్పత్తిని ఇప్పుడు 54 వేల టన్నులకు పెంచామని వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు