HomeతెలంగాణPM Modi: బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్‌.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

PM Modi: బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్‌.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన భారీ విజయానంతరం ఇప్పుడు తెలంగాణపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఒకప్పుడు బీజేపీని పరిమిత ప్రభావం ఉన్న పార్టీగా చూసేవారని, కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. దక్షిణ భారతం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ బీజేపీ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ

పార్టీ విజయాలు కేవలం రాజకీయ గెలుపులు మాత్రమే కాదని, దేశ సేవకు అంకితభావంతో పని చేస్తున్నామనే విషయాన్ని చూపిస్తున్నాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిని ప్రోత్సహిస్తూ కుటుంబ పాలనకే కాంగ్రెస్ పరిమితమైందని, రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని మోదీ చెప్పారు. వామపక్షాల పాలనలో ఉన్న ప్రతికూల విధానాలనే టీఎంసీ కొనసాగించిందని, దీంతో ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. అభివృద్ధి ఆగదని, ప్రజలు ఇప్పుడు అభివృద్ధి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి ఏడాది ఎన్నికలు జరుగుతాయని, గెలుపు-ఓటములు ప్రజాస్వామ్యంలో సహజమని మోదీ అన్నారు. కానీ బెంగాల్‌లో బీజేపీ విజయం దేశవ్యాప్తంగా చర్చకు రావడం ప్రత్యేకమని చెప్పారు. ప్రజలు టీఎంసీ పాలన నుంచి బయటపడాలని కోరుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలోనూ బీజేపీ బలోపేతం

ఇక తెలంగాణ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో బీజేపీకి ఒకే ఒక్క ఎంపీ ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా ప్రజల్లో మార్పు కోరిక కనిపిస్తోందని చెప్పారు. బెంగాల్‌లో కనిపించిన రాజకీయ ఉత్సాహం ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు.  అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని మోదీ అన్నారు. కుటుంబ రాజకీయాల కంటే అభివృద్ధి, నమ్మకానికి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణ మార్పుకు సంకేతమని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు