HomeజాతీయంVijay: విజయ్ తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణం, కాంగ్రెస్ కు పెద్దపీట!

Vijay: విజయ్ తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణం, కాంగ్రెస్ కు పెద్దపీట!

Vijay to Form Government: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు చివరకు ముగింపు లభించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఇవాళే ప్రమాణస్వీకారం

ఇవాళ (మే 10వ) ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం

టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే సెంగోట్టియన్, ఆధవ్ అర్జున్, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్ వంటి నేతలకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత మంత్రివర్గ విస్తరణ చేపట్టి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని టీవీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

108 స్థానాలు గెలిచిన టీవీకే

ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో పార్టీ బలం 107కి తగ్గింది. అనంతరం కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడంతో టీవీకేకు అవసరమైన మెజారిటీ లభించింది. చివరి నిమిషంలో ఐయూఎంఎల్ కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించడంతో మొత్తం బలం 120కి చేరింది. 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం టీవీకేకు లభించడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇక వచ్చే మూడు రోజులలో అసెంబ్లీలో బలనిరూపణ జరగనుందని సమాచారం.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు