-
సర్పంచ్ రాపోలు చొరవతో మారుతున్న గ్రామం రూపురేఖలు
-
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనుల జోరు
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్: గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా శివన్నగూడ గ్రామం నేడు, అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. స్థానిక సర్పంచ్ నాయకత్వంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గ్రామ రూపురేఖలను మారుస్తున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన పంచాయతీ పాలకవర్గం, ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ముందుకు సాగుతోంది. సిసి రోడ్ల నిర్మాణం గతంలో ఎన్నడూ లేని విధంగా, గ్రామంలోని పలు వీధుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. వర్షాకాలంలో బురదమయంగా మారే వీధులు, చాలా చోట్ల ఇప్పుడిప్పుడే సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయి.
స్థానికంగా లభించే వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులను పూర్తి చేయడం విశేషం. దీనివల్ల గ్రామ అభివృద్ధి మెరుగుపడటమే కాకుండా, పారిశుద్ధ్యం కూడా మెరుగైందని స్థానికులు తెలుపుతున్నారు. గ్రామ శివారులోని చెరువు వెనుక ముత్యాలమ్మ గుడి నిర్మాణాన్ని, సర్పంచ్ రాపోలు యాదగిరి తన సొంత నిధులతో, గ్రామస్తుల సపోర్ట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. గ్రామ దేవతపై ఉన్న భక్తితో పాటు, సామాజిక బాధ్యతగా ఆలయ అభివృద్ధికి పూనుకోవడంపై, ఆధ్యాత్మిక వాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రామానికి ఒక కొత్త శోభను తీసుకువస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
తాను పుట్టిన గ్రామంలో ఎవరైనా మరణించినా, ఆపదలో ఉన్నా సర్పంచ్ తక్షణమే స్పందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 10వేల ఆర్థిక సాయం అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో, పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం గమనార్హం.రాజకీయ విమర్శలు సహజమైనప్పటికీ, సర్పంచ్ మాత్రం అందరినీ కలుపుకుని పోయే ధోరణిని అవలంబిస్తున్నారు. “గ్రామ అభివృద్ధిలో రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతో, ఇతర పార్టీల నేతలతో సమన్వయం చేసుకుంటూ, గ్రామ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నారు.
గ్రామంలో అత్యవసర వైద్య సదుపాయాల కోసం, త్వరలోనే ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యేతో చర్చలు జరిపి, నిధుల మంజూరుకు కృషి చేస్తున్నారు. నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తూ, గ్రామ ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా సర్పంచ్ పాలన సాగిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి నిధులను నమ్ముకోకుండా, ముందడుగు వేస్తున్న సర్పంచ్ రాపోలును పలు రాజకీయ నాయకులు సైతం కొనియాడుతున్నారు. గ్రామ అభివృద్ధిలో ఊరిపై ఆయనకు ఉన్న ప్రేమ స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకై, ఆయన నిరంతరం చేస్తున్న కృషి నాయకత్వానికి ఊపిరి పోస్తుంది. సేవే లక్ష్యంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అందరికి ఆదర్శమే