Early Monsoon: మండుటెండటతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా మే చివరి వారంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఈ ఏడాది మే 14 నుంచి 16 మధ్యలోనే ప్రవేశించే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
మే నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని IMD వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈశాన్య, తూర్పు మధ్య భారత ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం కొంత తక్కువగా ఉండవచ్చని సూచించింది.
మండే ఎండలు అలాగే..
ఇక వర్ష సూచన ఉన్నప్పటికీ, ఎండల తీవ్రత మాత్రం తగ్గకపోవచ్చని హెచ్చరించింది. మే నెలలో పగటి వేడి మాత్రమే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది. అయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కొంతవరకు సాధారణ స్థాయిలో ఉండవచ్చని చెప్పింది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంతాల్లో వాతావరణం కొంచెం భిన్నంగా ఉండనుంది. సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా అనిపించినా, ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని హెచ్చరించింది. ముందస్తుగా వచ్చే రుతుపవనాలు కొంత ఉపశమనం ఇచ్చినా, ఎండల ప్రభావం ఇంకా కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.